Tuesday, August 23, 2011

విప్లవ 'మాత్ర' - వైకుంఠ యాత్ర





You can see this poetic political comment on www.5amnews.com

యాత్రలిచ్చు ఓదార్పు
యాత్రలిచ్చు ఓర్పు!
రాజకీయమెంతో నేర్పు!
పదవులు పట్టే నేర్పు!

* * *
ఆమోదం పొందదేల నా రాజీనామా!
పొందకుంటే పదవికదే పెద్ద వీలునామా!
రాజీనామా చెయ్ ! రోడ్డు మీద రచ్చ చెయ్!
పదవి పట్టి వేళ్ళాడుతూ ఉద్యమాల 'ఉచ్చు'వెయ్!

* * *
అవినీతికి విత్తనం నేటి రాజకీయం!
జనంపైన పెత్తనం నేటి రాజకీయం!
కలివిడిగా ఉంటే కాదట అది ప్రగతి!
విడిపోతే పడిపోతే అది 'వారికి' పురోగతి!

* * *
యముని మహిషపు లోహఘంట కాదోయి ఉద్యమం
'భజన' 'విభజన' కాదోయ్ జనం కోరే ఉద్యమం!
నీ పదవికి హామీలు ఇవ్వదోయ్ ఉద్యమం!
విజ్ఞతకు, త్యాగానికి చిరునామా ఉద్యమం!

* * *
'చిరు' జట్టుతో నిలిచేనా నీతిలేని ప్రభుత!
చిరుగాలికి ఆరునా పెను కాంగ్రెస్ ఘనత!
వేయి గొడ్లు తిన్నాక పెద్ద రాబందు -
కథ కూడా బందుకదా 'జనమే' కామందు!

* * *

హజారే... అవినీతికి బేజారే!



అవినీతిని చెండాడే ఒకే ఒక్క యోధుడు!
జనావళిని ప్రభావితం చేసిన తాజా వీరుడు!
వృద్ధాప్యానికి సైతం వన్నె తెచ్చిన కుర్రాడు!
సర్కారుకు ముచ్చెమటలు పట్టించెను చూడు!
ఉరకలెత్తి వచ్చె చూడు మలి ఉద్యమ సూరీడు!
మహోద్యమం మహోదయం ఇక తప్పదు నేడు!

Saturday, July 30, 2011

*గంగలో మునగంగ...!

మునిగాను!
దేహంలోకి దేశం ప్రవహించింది!
వెలిగాను!

* * *

గంగైతేనేం! గోదావరైతేనేం!
పోరాటమంతా కాలుష్య నిర్మూలన కోసం!

* * *
గంగలా మనసు!
కాలుష్యంలా ఆలోచన!

* * *

మునగకముందు - భావ దారిద్ర్యం!
మునిగాక - భావ రాహిత్యం!

* * *
ఎన్ని తరాలు నీలో మునకలేశాయో గంగా!
కడుపులో కాలుష్యం - కంటినిండా బెంగ!!

* * *

జీవన ప్రవాహం గంగలా ...
బతుకు తెల్లారిందన్న బెంగలా...!

* * *

నింగినుండి దూకింది! కాళ్ళు విరిగుంటాయి!
చీకటి చీర చుట్టుకుని చతికిలబడింది!

* * *

దూకి ప్రవాహమయ్యావు నువ్వు!
బతుకు చితిలో దూకి ప్రమాదమయ్యాను నేను!

* * *

గంగ వూయల ఒడిలో వూగే శవం!
బతుకు వశం కాని 'పర'వశం!!

* * *

శవంతోపాటు ఆమె కన్నీరు తేలుతోంది!
గంగమీద తెట్టుకట్టిన నూనెలా!!

* * *

వొడ్డున గంగ భజన, ధనార్జన...
పాపాలు కడిగే 'గంగ' పనిలో పండా నయవంచన!

* * *

పడవకు తెడ్డు వేశాడు!
అబ్బో! వాడు గంగకే అడ్డేశాడు!
జీవితాలను తీరం చేర్చాడు!

* * *

గతానికి సాక్ష్యం!
వర్తమానంలో కాలుష్యం!
భవిష్యత్తులో శూన్యం!

* * *

దండకారణ్యమధ్యంలాంటి జీవితంలో
బతుకు అక్షరం కావడం పాపం!
పోరాటం కాకపోవడం నేరం!

* * *

గంగ ఒక్కటే - ప్రవాహాలు వేరు!
బతుకు ఒక్కటే - అహంకారాలు వేరు!!


కవిత్వమంటే వూహ కాదు!
అక్షరానికి అర్ధరాత్రి పుట్టిన ఈహ!!

* * *

గంగ వైపు నడక నీతి...
గత వైభవాల వెనక పడక...భీతి..!

* * *

గంగ ముందుకి - భావి తరాల్లోకి....
నేను వెనక్కి - మునక తప్ప గంగ తీర్ధం నోట్లో వేసుకోలేక -
వేదనతో తడిసిన వొంటితో ఇంటికి..!

(*ఆ మధ్య Kanpur వెళ్ళి గంగలో మునిగాక పొంగిన అక్షర 'గంగ'!)

Saturday, July 9, 2011

ఊహ

మిమ్మల్ని నేను హింస పెడుతున్నానన్న స్పృహ ఊహేమో!
అంతర్జాలంలో కవిత్వం తప్పించుకోలేని అక్షరాయుధం !

పోగు

చంద్రుడు దిగంబరుడు !
నూలు పోగుల కోసం ఎన్ని యుగాలుగా
వెయిట్ చేస్తున్నాడో !

మదతనం

మనిద్దరమే పడి దొల్లాం కదయ్యా!
నీ పుణ్యాన ఓ బిడ్డని కని తల్లినవుదామనుకున్న!
నిన్ను తండ్రిని చేస్తాను కదా అని మురిసిపోయిన !
నీ 'అమ్మ' అడ పిల్లని వాళ్ళ అమ్మ చంపేసి ఉంటే నువ్వెట్టా పుట్టేవాడివయ్యా!
చంపేసున్నా బాగుండేది!
బిడ్డ పుట్టకముందే చంపే కొడుకు అవుతావని తెలిస్తే నిన్ను పురిట్లోనే చంపేసేదేమో!
తల్లి ఉసూరుమంటూ నీకు ఉసురిస్తుంది!
నిన్ను తండ్రిని చేయడానికి పది నెలలు తల్లడిల్లే తల్లి ఉసురు నీకెందుకు తగులుతుంది?
బొడ్డు తాడు తెగినపుడు కెవ్వుమనే కేకకు ఆడ మగ ఏంటయ్యా ?
నిన్ను పుట్టించినోడికైనా తెలీదు కదయ్యా కడుపులో పడే గుడ్డు ఆడా మగో!
క్షేత్రం నాది ! బీజం నీది!
మోదం మనది! మదం నీది!
నొప్పులు నావి! గొప్పలు నీవి!
నీలాంటి కొడుకును కనాల్సొస్తుందని, నువ్వెత్తిన గొడ్డలికి 'మగతనం' అంటాలని నేనే నీ ముందుకు వచ్చానయ్యా!
నువ్వు నన్నెక్కడ చంపగలవు?
నేను విశ్వవ్యాప్తమైన విరక్తిని!
విసుగెత్తిన శక్తిని!
మూడువైపుల మున్నీటిని నింపుకున్న నడిచే కన్నీటి బొట్టుని!
మదతనానికి గొడ్డలి పెట్టుని!

(ఆడపిల్లలనే వరసగా ప్రసవిస్తోందని గొడ్డలితో దాడి చేసిన భర్త'వార్త 'చదివాక !)