Friday, April 25, 2025

నాకొద్దిక్కడ మరో జన్మ


నాకొద్దిక్కడ మరో జన్మ

అంతిమ యాత్రలో సైతం వదలని నా

కుల మతాల నీడలతో కనీసం విహార యాత్ర కూడా చేయలేను!
బతకడానికి కూడా పనికిరాని కులమతాల కవచ
కుండలాలు నాకెందుకు?
ఇంతకీ కులమతాల వేటకుక్కల్ని నా మీదకు
ఉసిగొలిపిందెవరు?
ఎవడ్రా ఇది జ్ఞానభూమి అంది!
అజ్ఞాన సముద్రంలో నిత్యం నెత్తుటి స్నానాలు!
నా తలరాతా? గీతా? ఏ మసక కళ్ళద్దాలతో చూడాలి నేను?
అలసత్వ ప్రవచనాల జ్ఞాన నేత్రాల్లోంచి చూడాలా?
ఎలా చూడాలీ అసంకల్పిత అనూహ్య మరణ శాసనాలు?
కుల మతాలు నాకేమీ ఆధార బంధాలు కావు!
అవేమీ అమ్మా నాన్నలు నాకిచ్చిన బహుమతులు కావు!
బతుకునే బలి తీసుకున్న విష బిందువులు!
***
ఒరేయ్! సకల చరాచర జీవరాసులు తిండి కోసమే కొట్టుకు ఛస్తాయ్!
జంతువైనా మరో జంతువుని వేటాడేది తిండి కోసమే కదరా!
చీమ చీమని చంపదు!
పులి మరో పులిని చంపదు!
సింహం మరో సింహాన్ని చంపదు!
నక్క మరో నక్కని చంపదు!
మరి నువ్వేంట్రా మానవ మృగంలా మనుషుల్నివేటాడతావ్?
మనిషిని మనిషెందుకురా వేటాడాలి?
ఏ చదువులు చెప్పాయి నీకు?
ఏ గురువు చెప్పాడు నీకు?
బస్సుల్లో, రైళ్ళల్లో, విమానాల్లో భూతల స్వర్గం చూడాలని వెళ్ళి
మనిషంత పెట్టెల్లో ఇంటికొచ్చార్రా!
ఎవరిదీ పాపం?
***
నువ్వే తుపాకీ కనిపెట్టి నువ్వే కులమతాలు కనిపెట్టి
నువ్వే పుస్తకాలు రాసుకుని నువ్వే కాల్చుకుని
స్మశాన దేశంలో మరణగీతాలాలపిస్తావా?
జంతువుల్లో మంచి జంతువు మనిషని
జంతువులు కూడా అనుకునే అవకాశం లేకుండా చేశావు కదరా? జంతువులిప్పుడు సిగ్గుపడుతున్నాయ్!
వీధి కుక్కలు విస్తుపోతున్నాయ్!
ఒక గుంపు అడవుల్లో దూరి మనుషుల్ని వేటాడుతుంది
మరో గుంపు అడవుల్లోంచి వచ్చి మనుషుల్ని
వేటాడుతుంది!
మనుషులేకదరా అందరూ!
మనిషిని చంపడానికి మనిషెందుకురా?
ఒకడు కులం తుపాకీతో మనిషికి గురి పెడతాడు
ఒకడు మతం తుపాకీతో మనిషికి గురి పెడతాడు
ఒకడు కరెన్సీ తుపాకీతో మనిషికి గురి పెడతాడు
మనిషికి మనిషి గురి పెట్టడానికి
ఎన్నెన్ని ఆయుధాలో!
***
అక్షరమంటే మనిషి కదా!
ఇదేమిటీ అక్షరం శవం కంపు కొడుతోంది!
ఈ అక్షరం మనిషి వాసనెయ్యాలి కదరా!
ఈ అక్షరాన్ని కప్పుకున్న కవిత్వం మనిషితనంతో
పరిమళించాలి కదరా!
ఈ అక్షర కవిత్వం చావు వాసనొస్తోందంటే
ఇక మనిషెక్కడరా?
ఈ కవిత్వం చావు వాసనొస్తోందంటే మనిషితనం
మరణించినట్టే కదరా!
ఏది ఏమైనా ఒరేయ్ దేవుడూ!
కుల మతాలే జ్ఞాన బీజాలుగా, సన్నాసులైనా,
సన్యాసులైనా
ఎన్ని అవతారాలెత్తినా కరెన్సీ కోసమే
పరుగెత్తాలని శ్వాసిస్తూ శాసిస్తూ
బుద్ధుడి బోధల్ని తిరగరాసిన ఈ దేశంలో
మాత్రం మళ్ళీ పుట్టించకు దేవుడా!
మనిషిగా మరో జన్మ తప్పదంటే కులమతాల్లేని
దేశంలో పుట్టేలా అనుగ్రహించు!
నీవల్ల కాదంటే పురిట్లోనే చంపెయ్!

-చల్లా రామ ఫణి
9247431892
25.04.2025

చిత్రం: ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ మృత్యుంజయ్ సౌజన్యంతో...

No comments:

Post a Comment