Saturday, July 30, 2011

*గంగలో మునగంగ...!

మునిగాను!
దేహంలోకి దేశం ప్రవహించింది!
వెలిగాను!

* * *

గంగైతేనేం! గోదావరైతేనేం!
పోరాటమంతా కాలుష్య నిర్మూలన కోసం!

* * *
గంగలా మనసు!
కాలుష్యంలా ఆలోచన!

* * *

మునగకముందు - భావ దారిద్ర్యం!
మునిగాక - భావ రాహిత్యం!

* * *
ఎన్ని తరాలు నీలో మునకలేశాయో గంగా!
కడుపులో కాలుష్యం - కంటినిండా బెంగ!!

* * *

జీవన ప్రవాహం గంగలా ...
బతుకు తెల్లారిందన్న బెంగలా...!

* * *

నింగినుండి దూకింది! కాళ్ళు విరిగుంటాయి!
చీకటి చీర చుట్టుకుని చతికిలబడింది!

* * *

దూకి ప్రవాహమయ్యావు నువ్వు!
బతుకు చితిలో దూకి ప్రమాదమయ్యాను నేను!

* * *

గంగ వూయల ఒడిలో వూగే శవం!
బతుకు వశం కాని 'పర'వశం!!

* * *

శవంతోపాటు ఆమె కన్నీరు తేలుతోంది!
గంగమీద తెట్టుకట్టిన నూనెలా!!

* * *

వొడ్డున గంగ భజన, ధనార్జన...
పాపాలు కడిగే 'గంగ' పనిలో పండా నయవంచన!

* * *

పడవకు తెడ్డు వేశాడు!
అబ్బో! వాడు గంగకే అడ్డేశాడు!
జీవితాలను తీరం చేర్చాడు!

* * *

గతానికి సాక్ష్యం!
వర్తమానంలో కాలుష్యం!
భవిష్యత్తులో శూన్యం!

* * *

దండకారణ్యమధ్యంలాంటి జీవితంలో
బతుకు అక్షరం కావడం పాపం!
పోరాటం కాకపోవడం నేరం!

* * *

గంగ ఒక్కటే - ప్రవాహాలు వేరు!
బతుకు ఒక్కటే - అహంకారాలు వేరు!!


కవిత్వమంటే వూహ కాదు!
అక్షరానికి అర్ధరాత్రి పుట్టిన ఈహ!!

* * *

గంగ వైపు నడక నీతి...
గత వైభవాల వెనక పడక...భీతి..!

* * *

గంగ ముందుకి - భావి తరాల్లోకి....
నేను వెనక్కి - మునక తప్ప గంగ తీర్ధం నోట్లో వేసుకోలేక -
వేదనతో తడిసిన వొంటితో ఇంటికి..!

(*ఆ మధ్య Kanpur వెళ్ళి గంగలో మునిగాక పొంగిన అక్షర 'గంగ'!)

No comments:

Post a Comment